జియాగూడలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే


కరోనా మహమ్మారిని నివారించేందుకు జియాగూడ మున్సిపల్‌ డివిజన్‌లో అర్బన్‌ హెల్త్‌ ప్రైమరీ సెంటర్‌ వైద్యాధికారులు, ఆశ వర్కర్లు, పోలీసులు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జియాగూడ మున్సిపల్‌ డివిజన్‌లో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జియాగూడ ప్రాంతాలైన ఇందిరానగర్, వెంకటేశ్వర్‌నగర్, దుర్గానగర్, సాయిదుర్గానగర్, మక్బరా, మేకలమండి, సబ్జిమండి, ఇక్బాల్‌గంజ్, సంజయ్‌నగర్‌ బస్తీల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరించింది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు జియాగూడ నలుమూలలా గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులు కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు. దీంతో గత 10 రోజులుగా జియాగూడ పరిసర ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పడుతోందని, కరోనాను నియంత్రించేందుకు కంటైన్మెంట్‌ ప్రాంతాలను కట్టడి చేయడంతో పాటు పలు హాట్‌స్పాట్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. 

వైద్య ఆరోగ్యశాఖ అధ్వర్యంలో ఇంటింటి సర్వే...
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న బస్తీలతో పాటు కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతిరోజు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.సుధా ఆధ్వర్యంలో ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి తిరుగుతూ ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. ఎవరి ఇంట్లోనైనా కోవిడ్‌–19 లక్షణాలు ఉన్న వ్యక్తి ఉంటే వెంటనే అధికారులకు సంప్రదించాలని, అతడికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించడం, లేక ఇంట్లోనే ఉంచి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.