అమెరికాలోని రాష్ట్రాలు మరిన్ని మరణాలు, ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన ‘స్టే ఎట్‌ హోం’ నిబంధనలను వేగంగా ఎత్తివేస్తే అమెరికాలోని రాష్ట్రాలు మరిన్ని మరణాలు, ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైట్‌హౌస్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు, సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంథొనీ ఫాసీ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రయత్నిస్తున్న తరుణంలో ఫాసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికాలోని సుమారు 24 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేసిన నేపథ్యంలో డాక్టర్‌ ఫాసీ సెనేట్‌ కమిటీకి ఓ వాంగ్మూలమిచ్చారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనను వేగంగా ఎత్తివేయడం వల్ల పరిస్థితులు అదుపు చేయలేని స్థితికి చేరుకునే అవకాశముందని స్పష్టం చేశారు.  కరోనా టీకా, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు హెచ్చుగా ఉన్నప్పటికీ అది పాఠశాలలు తెరిచేలోపు మాత్రం కాదని ఫాసీ అన్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేసిన దాదాపు 17 రాష్ట్రాలు ఇందుకు సంబంధించి వైట్‌హౌస్‌ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించలేదని అసోసియేటెడ్‌ ప్రెస్‌ జరిపిన ఒక అధ్యయనం ద్వారా తెలిపింది.