వ్యక్తిగత పాస్‌ల విషయంలో గందరగోళం


లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేర్వేరు రాష్ట్రాలు, నగరాల్లో చిక్కుకుపోయి, తమ స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తున్న వారికి జారీ చేసే పాస్‌ల విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఇచ్చిన ఆదేశాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. వీటిలో కచ్చితంగా వన్‌వే పాస్‌లు మాత్రమే జారీ చేయాలంటూ స్పష్టంగా పేర్కొనడంతో పోలీసు విభాగం ఆ మేరకు మాత్రమే ఇస్తోంది. వీటిని చూసిన అద్దె వాహనాల డ్రైవర్లు తాము రాలేమంటూ స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా నగరంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులు, టూరిస్ట్‌లు తదితరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

పలు మార్గదర్శకాలు..
లాక్‌డౌన్‌ ఫలితంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్నవారి స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతించిన ఎంహెచ్‌ఏ ఆ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిలో ఇలా తమ స్వస్థలాలకు వెళ్లాలని భావించే వారు చిక్కుకున్న ప్రాంతానికి చెందిన పోలీసులకు పాస్‌ కోరుతూ ఆన్‌లైన్‌లో లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అలా వెళ్లాలని భావిస్తున్న వాళ్లు ఎలా వెళ్తున్నారు? ఆ వాహనం నంబర్‌ ఏంటి? తదితర అంశాలను దరఖాస్తులో పూరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది ముందే తేలికపాటి వాహనాలు,  బస్సులు తదితరాలను అద్దెకు తీసుకుంటూ డ్రైవర్లు, యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆ తర్వాతే సదురు వాహనం నంబర్‌తో పాస్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.