నెల్లూరులోని శ్రీబాలాజీ కెమికల్స్ లో అగ్ని ప్రమాదం : వెలుబడుతున్న దట్టమైన పొగ, ఘాటు వాసన


ఆంధ్రప్రదేశ్ : నెల్లూరులోని శ్రీబాలాజీ కెమికల్స్ కంపెనీకి చెందిన గోడౌన్ లో  ఫ్యాక్టరీలో తయారైన వస్తువులను ఇక్కడ నిల్వ ఉంచుతుంటారు. బళ్లారి-కృష్ణపట్నం జాతీయ రహదారికి సమీపంలో పెన్నానదికి ఆనుకుని ఉంటుందా గోడౌన్. బాలాజీ కెమికల్స్ ఫ్యాక్టరీలో తయారైన బ్లీచింగ్ పౌడర్, లైమ్ పౌడర్, లిక్విడ్ హ్యాండ్ వాష్, డిటర్జెంట్ పౌండర్ వంటి రసాయనిక ఉత్పత్తులను ఈ గోడౌన్‌లో నిల్వ ఉంచుతుంటారు. ఆదివారం అందులో మంటలు చెలరేగాయి. రసాయనిక మిశ్రమాలతో తయారు చేసిన ఉత్పత్తులు కావడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దట్టమైన పొగ, ఘాటు వాసన వెలువడింది. బోడిగాడి తోట సమీప ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ముఖాలకు మాస్కులు వేసుకుని రోడ్ల మీదికి పరుగులు పెట్టారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే నెల్లూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరకున్నారు. మంటలను సకాలంలో ఆర్పివేయగలిగారు. మంటలను అదుపు చేయడానికి నీళ్లతో పాటు కొన్ని రసాయనాలను వినియోగించారు. ఈదురుగాలులకు ఓ చెట్టుకొమ్మ విరిగి ఫ్యాక్టరీకి దగ్గరే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మీద పడటం వల్ల మంటలు చెలరేగాయని ప్రాథమికంగా నిర్ధారించారు.సమాచారం అందుకున్న వెంటనే జిల్లాకు చెందిన జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు అక్కడే ఉండి నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు. జిల్లాకే చెందిన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. అనిల్ కుమార్ యాదవ్‌తోనూ మాట్లాడారు. అధికార, పోలీసు, అగ్నిమాపక యంత్రాంగం సకాలంలో స్పందించడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )