జిల్లాలో స్టేట్‌ వైరాలజీ ల్యాబ్, రుయాలో కరోనా ల్యాబ్‌

కరోనా పేరు వింటేనే ప్రతి ఒక్కరూ ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఎవరైనా దగ్గినా, తుమ్మినా, అనుమానం వచ్చినా ఆమడదూరం పారిపోవడం పరిపాటిగా మారింది. అయితే వారికి దగ్గరగా ఉంటూ స్వాబ్‌లు సేకరించి, వాటిని రెండు విధాలుగా పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేయడంలో ల్యాబ్‌ టెక్నీషియన్లు కీలకంగా పనిచేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ల్యాబ్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విస్తరించారు. దూరదృష్టితో ప్రతి జిల్లాలోనూ 2 నుంచి 4 వైరాలజీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
సకాలంలో ల్యాబ్‌లను సమకూర్చడంతో పాటు అవసరమైన టెక్నీషియన్లను, మైక్రోబయా లజీ అసిస్టెంట్లను కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించారు. స్విమ్స్‌ కేంద్రంగా కోవిడ్‌–19 స్టేట్‌ వైరాలజీ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ రాష్ట్రంతో పాటు 20 రోజుల క్రితం వరకు తెలంగాణాకు చెందిన నమూనాల ఫైనల్‌ కరోనా ఫలితాలను నిర్వహించగలిగారు. రుయాలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఐసీఎంఆర్‌ అనుమతితో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ యూనిట్‌ను జిల్లా యంత్రాంగం ఆగమేఘాలపై ఏర్పాటు చేసింది.