రైతుబంధు ఎగ్గొట్టే ఆలోచన లేదు: కేటీఆర్‌

రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సాయం అందిస్తున్నామని వివరించారు. రైతువారీ వివరాలను అధికారులు సేకరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పంట కల్లాలు, సాగునీటి కాల్వల నిర్మాణం చేపట్టాలని కేటీఆర్‌ సూచించారు. రంగనాయక సాగర్‌ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌ మండలానికి సాగునీరు అందనుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతు సంక్షేమం విషయమై ఎలాంటి పరిస్థితుల్లో రాజీపడబోమని స్పష్టం చేశారు. డిసెంబరు నాటికి మధ్యమానేరు నుంచి ఎగువ మానేరులోకి 9వ ప్యాకేజీ ద్వారా సాగు నీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల మధ్య ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 210 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉండే విధంగా స్థలాన్ని సేకరించాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు.