గ్రేటర్ పరిధిలో సోమవారం కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రతిరోజూ సుమారు 40పైనే పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. ఆ సంఖ్య తగ్గడంతో కాసింత ఊరట లభించినట్లయ్యింది. అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్ ఆస్పత్రిలో 82 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 26 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి 14 మంది అనుమానితులు రాగా, వారిని ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. వీరి నుంచి స్వాబ్స్ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. కింగ్‌కోఠి ఆస్పత్రి ఓపీకి 91 మంది రాగా, వీరిలో 33 మంది నుంచి నమూనాలు సేకరించారు. 14 మందిని అడ్మిట్ చేశారు. ఒకరికి పాజిటివ్ రావడంతో గాంధీకి తరలించారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో ఒకరికి పాజిటివ్ రాగా అతడిని గాంధీకి తరలించారు. నెగిటివ్ వచ్చిన మరో 8 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఇద్దరు ఉన్నారు.