అణ్వాయుధ సామ‌ర్థ్యం పెంపు!

గ‌త కొంత‌కాలంగా జాడ లేకుండా పోయిన ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ మ‌ధ్యే ఎరువుల ఫ్యాక్ట‌రీ ఓపెనింగ్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన విష‌యం తెలిసిందే. ఇది జ‌రిగి మూడు వారాలు కావ‌స్తుండ‌గా మ‌రోసారి మీడియాకు చిక్కాడు. కానీ ఈసారి మాత్రం ఆషామాషీ కార్య‌క్ర‌మం కాదు. సెంట్ర‌ల్ మిలిట‌రీ క‌మిష‌న్‌తో అణ్వాయుధాల సామ‌ర్థ్యం గురించి చ‌ర్చించేందుకు స‌మావేశ‌మ‌య్యాడని అక్క‌డి అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్ల‌డించింది. ఈ కార్య‌క్ర‌మంలో అణుసామ‌ర్థ్యాన్ని పెంపొందించునే దిశ‌గా విధివిధానాల‌ను ఖ‌రారు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 
అలాగే ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఇందుకోసం సైనికా విద్యా సంస్థ‌ల‌ను మ‌రింత మెరుగుప‌ర్చ‌డం, భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ల‌ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేసే దిశ‌గానూ చర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపింది. ఈ స‌మావేశం మిలిట‌రీ ద‌ళాల‌తో గ‌త కొద్దిరోజులుగా జ‌రుగుతోంద‌ని కేసీఎన్ఏ పేర్కొంది. కాగా ఆమ‌ధ్య కిమ్ ఆరోగ్యం విష‌మించిందంటూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సుమారు 20 రోజుల త‌ర్వాత ఆయన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కానీ నోరు విప్పి మాట్లాడ‌లేదు. పైగా శ‌రీరంలో కొన్ని మార్పులు క‌నిపించ‌డంతో అత‌ను న‌కిలీ కిమ్ అన్న వాద‌నలు తెర మీద‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ అది రుజువు కాలేదు.