ఎండ తీవ్రతతో కోళ్లు మృత్యువాత

ఒకవైపు  కరోనా  ప్రభావంతో    పౌల్ట్రీ  రంగం   సంక్షోభంలో పడింది. దీనికితోడు మండుతున్న ఎండలు కోళ్ల పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. చిరుప్రాణులైన కోళ్లు విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోపౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయని పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే వేసవి కారణంగా గుడ్లు ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది. ఎండల తీవ్రత కారణంగా సాధారణంగానే కోడి పెట్టే గుడ్ల సంఖ్య 30 శాతం వరకు పడిపోతోంది. ఒకపక్క నిలకడ లేని గుడ్డు ధరతోపాటు ఏటా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో కోళ్ల పరిశ్రమకు నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డు ధర సైతం రూ. 2.80కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.