సింగిల్స్, డబుల్స్‌ మ్యాచ్‌లను వేర్వేరు వేదికల్లో నిర్వహించాలి


కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వచ్చాక ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ఆట పునరుద్ధరణలో కీలక మార్పులు చేయాలని భారత జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తరచూ ప్రయాణించే వీలు లేకుండా... ఒకే వేదికపై అనేక టోర్నీలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించాడు. కరోనా కారణంగా బీడబ్లూఎఫ్‌ జూలై చివరి వరకు అన్ని ముఖ్యమైన టోర్నీలను వాయిదా వేసింది. అయితే పరిస్థితులు సద్దుమణిగాక ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీడబ్ల్యూఎఫ్‌ చర్యలు తీసుకోవాలని గోపీచంద్‌ పేర్కొన్నాడు. ‘కరోనా అనంతర పరిస్థితులకు అనుగుణంగా బీడబ్ల్యూఎఫ్‌ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. టోర్నీల నిర్వహణ, ఫార్మాట్‌ ఇలా అవసరమున్న అన్ని అంశాల్ని సవరించాలి’ అని గోపీ అన్నాడు.

వాయిదా పడిన థామస్‌ ఉబెర్‌ కప్‌ ఫైనల్, ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించాలని ఆతిథ్య దేశాలను ప్రపంచ సమాఖ్య కోరింది. దీనిపై స్పందించిన గోపీ ‘మీరు టోర్నీ తేదీల మార్పు గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ టోర్నీల నిర్వహణపై ఆలోచనా విధానం మారాలి. ఆటగాళ్లంతా ఒకే వేదికపై ఎక్కువ టోర్నీలు ఆడేలా ప్రణాళికలు రచించాలి. వేర్వేరు టోర్నీల కోసం వారానికో దేశం ప్రయాణించడం వారి ఆరోగ్యానికి చేటు కలిగించొచ్చు. ప్రేక్షకుల్ని ఎలాగూ అనుమతించే పరిస్థితి లేదు కాబట్టి పురుషుల సింగిల్స్‌ ఒక దేశంలో, మహిళల సింగిల్స్‌ మరో దేశంలో, డబుల్స్‌ ఇంకో దేశంలో నిర్వహిస్తే... ఒకే సమయం లో మూడు ఈవెంట్‌లలో పోటీలూ జరుగుతాయి, ప్రతీ ఆటగాడు ప్రతీ దేశం తిరిగే బాధ కూడా తప్పుతుంది. కేవలం రెండు, మూడు కోర్టుల్లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తే సరిపోతుంది. ఆటను పునరుద్ధరించాలనుకుంటే ఇలాంటి పద్ధతులు పాటిస్తే మంచిది’ అని తన ఆలోచనను పంచుకున్నాడు.