బంతిని షైన్‌ చేయడం కోసం సలైవా వద్దే వద్దు..

 కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా పలు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని భావిస్తోంది. ఆస్ట్రేలియాలో క్రికెట్‌ అత్యంత ఆదరణ క్రీడ కావడంతో  పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. క్రికెట్‌ కార్యకలాపాలు పునరుద్ధించబడ్డాక లాలాజలం(సలైవా), స్వీట్‌ పదార్థాలను బంతిపై మెరుపు కోసం ఉపయోగించుకుండా ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే దీనికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) బంతిని షైన్‌ చేయడానికి సలైవాను నిషేధించాలనే కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. అదే సమయంలో అంపైర్ల సమక్షంలో ‘ట్యాంపరింగ్‌’కు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుగా తమ ప్రణాళికలను సిద్ధం చేసింది. సలైవాపై ఐసీసీ నిషేధం విధించినా, విధించకపోయినా తమ క్రికెట్‌ జట్టు మాత్రం అందుకు దూరంగా ఉండాలనే మార్గదర్శకాలను సిద్ధం చేసింది. 
ఈ మేరకు ఆస్ట్రేలియా సమాఖ్య ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా సంక్షోభం ముగిసి క్రికెట్‌ ఆరంభమైన తర్వాత ఇవి కచ్చితంగా పాటించాలనే నిబంధనను ప్రవేశపెట్టింది. ఆస్ట్రేలియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌(ఏఐఎస్‌).. వైద్యరంగ నిపుణులతో పాటు క్రీడా సంఘాలు, ప్రభుత్వంతో చర్చించి కొన్ని నిబంధనలు సూచించింది. ఇందులో ఏ,బీ,సీలుగా మూడు కేటగిరీలను పొందు పరిచింది. లెవల్‌-ఎలో వ్యక్తిగత ప్రాక్టీస్‌ను మినహాయించి అన్ని రకాల ప్రాక్టీస్‌లకు దూరంగా ఉండాలని పేర్కొంది. లెవల్‌-బిలో నెట్‌ ప్రాక్టీస్‌‌లో బ్యాటర్స్‌ బౌలర్లను ఎదుర్కోనే క్రమంలో బౌలర్లు పరిమితంగా ఉండాలని తెలిపింది. వ్యక్తికి వ్యక్తికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో వార్మప్‌ డ్రిల్స్‌కు దూరంగా ఉండాలని పేర్కొంది.