ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో మృతులకు రూ.కోటి పరిహారం ఇచ్చాం


ముఖ్యమంత్రి  దమ్మున్న సీఎం అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన నేపథ్యంలో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారం రాత్రి విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షలు, రెండు రోజులకు మించి ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.లక్ష చొప్పున.. ఊహించనంత పరిహారం అందజేయడం, ఎల్‌జీ పాలిమర్స్‌లో ఉన్న 13 వేల టన్నుల స్టైరీన్‌ గ్యాస్‌ను దక్షిణ కొరియాకు వెనువెంటనే తరలించడం వంటి చర్యలు ఆయన దమ్మున్న సీఎం అనే విషయాన్ని మరోసారి రుజువు చేశాయన్నారు. ఇంకా ఏం చెప్పారంటే.. 

► గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేశంలో మరే ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దేశ చరిత్రలో ఇదే అతి పెద్ద ప్యాకేజీ. 
► మృతుల్లో 8 కుటుంబాల వారికి రూ.కోటి చొప్పున చెల్లించాం. నలుగురి కుటుంబ వారసులకు గురువారం అందజేస్తాం. 
► కేజీహెచ్‌లో రెండు రోజులకు పైగా చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ మేరకు రూ.లక్ష చెల్లిస్తున్నాం. ప్రమాదం జరిగిన ఐదు రోజుల్లోగానే పరిహారం చెల్లించిన ఘనత జగన్‌కే చెల్లింది. 
► బాబు హయాంలో నగరంలో జరిగిన గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలుడు ఘటన, పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్‌ సరదా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి ఎంత పరిహారమిచ్చారో ఆయన గుర్తు చేసుకోవాలి.  
► ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో బాబు డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉంది.