మరో దళితుడిపై దాడి .. ప్రేమ పేరుతో హత్య


తెలంగాణ :  జన్నారంకు చెందిన ఓ యువకుడు (18), అదే గ్రామానికి చెందిన ఓ యువతి ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అతనిది మాల సామాజిక వర్గం కాగా.. యువతిది గౌడ సామాజికవర్గం. మే 16వ తేదీన పొంకల్ అనే గ్రామ శివారులో ఉన్న ఓ ఆలయం వద్దకు సాయంత్రం 6.30గంటలకు రావాలని యువతి అతనికి కబురు పంపించింది. అనుకున్నట్టుగానే ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. అయితే ఆ రాత్రి ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్లలేదు.యువతి కోసం ఆమె కుటుంబ సభ్యులు గ్రామంలోని ప్రతీచోటా గాలించారు. కానీ లాభం లేకపోయింది. మరుసటి రోజు ఆ యువకుడు తన స్నేహితుడైన అబ్దుల్ అనే యువకుడికి తమ లొకేషన్ షేర్ చేశాడు. కొన్ని బిస్కెట్లు,వాటర్ బాటిల్ తీసుకురావాల్సిందిగా చెప్పాడు. ఈ విషయం తెలిసి అబ్దుల్‌పై ముత్యం సాయి,గరిపెట్టి హరీష్ గౌడ్,ప్రశాంత్,అజ్మత్ ఖాన్ అనే నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఇందులో హరీష్ అనే వ్యక్తి బాధితురాలికి దూరపు బంధువు. అబ్దుల్‌తో పాటు ఆ యువకుడి స్నేహితులను మరికొందరిని పట్టుకుని అతని లొకేషన్ చెప్పాలంటూ దాడికి పాల్పడ్డారు.అనంతరం ఆ నలుగురూ ఆ లొకేషన్‌కి వెళ్లి దళిత యువకుడిని పట్టుకుని విచక్షణారహితంగా బెల్టులు,కర్రలతో దాడి చేశారు. దుస్తులు విప్పించి ఎండ వేడిలో ఓ బండపై పడుకోపెట్టారు. దాహంతో అల్లాడుతున్న ఆ యువకుడు నీళ్లు కావాలని ఏడుస్తుంటే.. కులం పేరుతో దూషిస్తూ బలవంతంగా మూత్రం తాగించేందుకు ప్రయత్నించారు. అంతేకాదు,పక్కనే ఉన్న ఓ వాగులో అతన్ని ముంచేందుకు ప్రయత్నించారని వెంకటేష్ అనే అతని బంధువు తెలిపాడు.తక్కువ కులం వాడివి నీకు మా అమ్మాయి ఎందుకు అంటూ కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మే 18న వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వాటితో పాటు సెక్షన్ 323,324,290,506ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )