కొత్త మార్పులొస్తాయి

కోవిడ్‌ 19 (కరోనా వైరస్‌) ప్రభావంతో ఏర్పడిన ఆందోళనకర పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత హిందీ చలన చిత్ర పరిశ్రమలో మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ –‘‘కరోనా ప్రభావం తగ్గిన తర్వాత బాలీవుడ్‌లో కొన్ని కొత్త మార్పులను చూడబోతున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో థియేటర్స్‌ కన్నా ఓటీటీ వంటి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనే సినిమాలు ఎక్కువగా విడుదల కావొచ్చు. ‘పే పర్‌ వ్యూ’ విధానంలో వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించి తమ స్మార్ట్‌ టీవీ లేదా స్మార్ట్‌ ఫోన్‌లో సినిమాలను వీక్షిస్తారు’’ అని పేర్కొన్నారు సునీల్‌ శెట్టి. ‘‘నేను చేసే చిత్రాల షూటింగ్స్‌ ఇండియాలోనే జరిగేలా ప్లాన్‌ చేసుకుంటాను. తద్వారా మన దేశంలో ఎందరికో ఉపాధి కల్పించే అవకాశం ఉంది’’ అన్నారు సునీల్‌ శెట్టి.