ఫ్లెక్సీ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

ఎవరు ఇక్కడ  ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది...నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని చెప్పాం కదా...అయినా ఎందుకు ఏర్పాటు చేశారంటూ మంత్రి  కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగడ్డ డివిజన్‌ పరిధిలోని సుల్తాన్‌నగర్‌బస్తీ ప్రాంతంలో శుక్రవారం మంత్రి కేటీఆర్‌ బస్తీ దవాఖానాను  ప్రారంభించారు. ఇందుకోసం మద్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు కేటీఆర్‌ కారు దిగగానే రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని తొలగిస్తే తప్ప తాను బస్తీ దవాఖానాను ప్రారంభించేది లేదని అధికారులకు తెలిపారు. అప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–19 డీఎంసీ రమేష్‌ను, ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ బిందును పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేయించిన స్థానిక కార్పొరేటర్‌ షహీన్‌ బేగంకు  అప్పటికప్పుడు రూ.20 వేలు జరిమానాను విధించారు. ఇందుకు సంబంధించిన రసీదును అధికారులు కార్పొరేటర్‌కు అందజేశారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ స్థానికంగా ఏర్పాటు చేసిన దవాఖానాను ప్రారంభించారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.