తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు : నిన్న ఒక్కరోజే 20 కి పైగా కేసులు నమోదు


తెలంగాణ : కొద్ది రోజులుగా తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గురువారం ఒక్కరోజే ఏకంగా 22 నమోదు కాగా, ముగ్గురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కేసుల సంఖ్య 1,038కి చేరుకున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ గంజ్‌లో పనిచేస్తున్న పహాడీ షరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్‌లో ముగ్గురు షాపుల యజమానులకు, వారి ద్వారా ఆయా కుటుంబసభ్యులకు కరోనా సోకింది. వీరి కుటుంబాలన్నిటినీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచామని ఈటల తెలిపారు. గంజ్, పహాడీషరీఫ్‌ ప్రాంతాలను కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా ప్రకటించి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గురువారం చనిపోయిన ముగ్గురు ఇతర అనారోగ్యాల వల్ల చనిపోయారని చెప్పారు. రామంతాపూర్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చేరిన 12 గంటల్లోనే చనిపోయినట్లు వెల్లడించారు.
షుగర్, బీపీ, స్థూలకాయం, న్యుమోనియాతో బాధపడుతూ చనిపోయారని తెలిపారు. అలాగే వనస్థలిపురానికి చెందిన 76 ఏళ్ల వ్యక్తి గుండె, కిడ్నీ, న్యూమోనియాతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే చనిపోయారని పేర్కొన్నారు. ఇక, దుర్గానగర్, జియాగూడకు చెందిన 44 ఏళ్ల మహిళ బుధవారం గాంధీ ఆస్పత్రికి వెంటిలేటర్‌ మీదే వచ్చారని, ఆ తర్వాత 6 గంటల్లోనే మరణించారని ఈటల వెల్లడించారు. ఈమె కూడా బీపీ, షుగర్, న్యుమోనియాతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. గురువారం 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. 50 ఏళ్ల వయసున్న డాక్టర్‌ కూడా కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు పేర్కొన్నారు. గాంధీలో 20 రోజుల కింద తీవ్రమైన వ్యాధి లక్షణాలతో అడ్మిట్‌ అయిన డాక్టర్‌కు హైడ్రోక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ తదితర మందులు అందించి పూర్తిగా నయం చేశామన్నారు. ప్రస్తుతం 568 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.