ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌ల నిర్వహణపై షోయబ్‌ అక్తర్‌ వ్యాఖ్య

ప్రేక్షకుల్లేని క్రికెట్‌ మ్యాచ్‌ల్లో అసలేమీ ఉండదని... ఇంకా  చెప్పాలంటే వధువు లేని పెళ్లిలా ఉంటుందని పాకిస్తాన్‌ మాజీ పేస్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఇది క్రికెట్‌ మార్కెట్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నాడు. వీడియో లైవ్‌ సెషన్‌లో అక్తర్‌ మాట్లాడుతూ  ‘క్రికెట్‌ బోర్డులు ఇప్పుడు గేట్లు మూసి ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించే ప్రణాళికల్లో ఉన్నాయి. కానీ ఇవి అంతగా విజయవంతమవుతాయని గానీ, ఎప్పట్లాగే మార్కెటింగ్‌ చేసుకుంటామని గానీ నాకు అనిపించడం లేదు. అసలు ఇది ఎలా ఉంటుందంటే వధువు లేకుండానే వివాహ తంతు జరిపించడంలా ఉంటుంది.

అయితే కరోనా మహమ్మారి విలయతాండవం ఏడాదికల్లా సాధారణ పరిస్థితికి వస్తుందని నేను ఆశిస్తున్నాను’ అని అన్నాడు.  2003 వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ సెంచరీ చేయాలనే ఆశించానని చెప్పాడు. ‘98 పరుగుల వద్ద సచిన్‌ అవుటవ్వడం నాకు బాధనిపించింది.  ఇది చాలా ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌. నా బౌన్సర్‌ను అంతకుముందు కొట్టినట్లే సిక్స్‌ కొడతాడనుకున్నా. కానీ ఔటయ్యాడు. పాక్‌ బౌలర్లపై చెలరేగిన సచిన్‌ 98 వద్ద ఔటయ్యాడు’ అని అన్నాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్‌ జయభేరి మోగించింది. 10 ఓవర్ల కోటా పూర్తిచేసిన అక్తర్‌ ఏకంగా 72 పరుగులు సమర్పించుకున్నాడు.