రెండు రోజుల క్రితం రాజీపేటతండాలో పట్టుబడిన చిరుత

జిల్లాలోని ఐదు మండలాల్లో సంచరిస్తున్న  చిరుతల బాధ తీరినట్లేనని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. రెండేళ్లుగా యాచారం, మాడ్గుల్, కందుకూర్, కడ్తాల్, ఆమన్‌గల్, షాదనగర్‌ మండలాల్లోని 30 వేల ఎకరాలకు పైగా ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయి. మొదట్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ అటవీ ప్రాంతం నుంచి రెండు చిరుతలు వచ్చాయని.. ఇవి యాచారం, మాడ్గుల్, కందుకూర్‌ మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో తిరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. సమీప గ్రామాల వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువులు, మేకలు, గొర్రెలపై దాడులు చేస్తూ ఆకలి తీర్చుకున్నాయి. ఏడాది తర్వాత వీటి సంతతి పెంచుకున్నాయని, మొత్తం నాలుగు చిరుతలు ఉన్నాయని పాదముద్రల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుతల సంతతి మరింత పెరిగితే అత్యంత ప్రమాదమని గుర్తించి, వీటిని పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం రెండేళ్లుగా రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేసి రెండు ప్రత్యేక టీంలు, రెండు వాహనాలు, సీసీ కెమెరాలు, పలు స్థలాల్లో పదికి పైగా బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతలను పట్టుకోవడానికి జూ పార్క్‌ నుంచి ప్రత్యేక నిపుణులను రప్పించినా ఫలితంలేకపోయింది.