గోదావరి జలాల వినియోగంపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశం

 ‘కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేసి కొండపోచమ్మ సాగర్‌ వరకు నీటిని పంప్‌ చేయాలి. మల్లన్న సాగర్‌ ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్‌ నింపి అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, చిల్పూర్‌ మండలాలకు నీరందించాలి. ఈ వానాకాలంలో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలి. గోదావరిలో ఎగువ నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్సారెస్పీని కాళేశ్వరం ద్వారా నింపాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్‌ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలన్నారు. దీనికోసం ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు (ఓటీలు), డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను 
యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్‌ గేజ్‌లు ఏర్పాటు చేయాలని, నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రియల్‌ టైమ్‌ డేటా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. రూ. వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందకు రావాలని, ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు నిర్వహణ (ఓ అండ్‌ ఎం) మ్యాన్యువల్‌ రూపొందించాలన్నారు.