ఆర్‌ఎంఓగా పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాని వైనం

విజయవాడలోని రాష్ట్ర స్థాయి కోవిడ్‌ 19 ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ (ప్రభుత్వాస్పత్రి) రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అసలు ఆ కుర్చీలో మేము కూర్చోమంటూ సీనియర్‌ ప్రొఫెసర్లు సైతం చేతులెత్తేస్తున్నారు. దీంతో రెండు నెలలుగా పూర్తి స్థాయి రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్‌ఎంఓ చూడాల్సిన బాధ్యతలను సైతం సూపరింటెండెంట్‌ చూసుకుంటున్నారు. కోవిడ్‌ ఆస్పత్రి నేపథ్యంలో నిత్యం రిపోర్టులు ఇవ్వడం, మృతదేహాలను క్రిమిటోరియంకు రోగుల పర్యవేక్షణ చూడాల్సిన ఆర్‌ఎంఓ లేక పోవడంతో పాలన క్లిష్టతరంగా మారింది. 
రెండు నెలల కిందట ఆర్‌ఎంఓ సరెండర్‌
కోవిడ్‌ 19 ట్రీట్‌మెంట్‌ సెంటర్‌కు సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్‌ ఆర్‌. గీతాంజలిని రెండు నెలల కిందట సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి. నాంచారయ్య డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు సరెండర్‌ చేశారు. ఆమె ఇక్కడ ఐదేళ్లుగా పనిచేశారు. అయితే ఎందుకు సరెండర్‌ చేయాల్సి వచ్చిందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అయితే  ఆదేశాల్లో మాత్రం పాలనా పరమైన చర్యల్లో భాగంగా సరెండర్‌ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఆమె ఏప్రిల్‌  మొదటి వారంలో రిలీవ్‌ అయ్యి వెళ్లి పోయారు. అప్పటినుంచి ఆర్‌ఎంఓ లేని పరిస్థితి నెలకొంది. 
ఇన్‌చార్జీలుగా ఉండని వైనం
డాక్టర్‌ గీతాంజలిని సరెండర్‌ చేసిన తర్వాత పిడియాట్రిక్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌ఎస్‌ విఠల్‌రావును ఇన్‌చార్జి ఆర్‌ఎంఓగా నియమించారు. ఆయన కొద్దికాలం యాక్టివ్‌గానే పనిచేశారు. తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ ఈ కుర్చీ నాకొద్దు అంటూ తన డిపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోయారు. అనంతరం డెర్మటాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ పెంచలయ్యకు ఇన్‌చార్జి ఇచ్చారు.  ఆయన కూడా రెండు రోజులు ఆర్‌ఎంఓ చాంబర్‌లో కూర్చుని తర్వాత వారం రోజులు సెలవుపై వెళ్లారు. తర్వాత డ్యూటీకి వెళ్లినా తన విభాగంలో విధులకు వెళ్లారే కానీ ఆర్‌ఎంఓ సీటులోకి రాలేదు. తాజాగా మరో అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌కు ఇన్‌చార్జి ఇవ్వగా అమ్మో ఆ సీటు నాకొద్దు.. నేను కొద్దిరోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నా అంటూ నిరాకరించినట్లు తెలిసింది.