అమెరికా అధ్యక్ష భవనంలో వేదం మంత్రాల పఠనం


అంతర్జాతీయం : అమెరికాలో కొనసాగుతున్న కరోనా కల్లోలానికి అడ్డుకట్ట వేసేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ చేయని ప్రయత్నం లేదు. ఏదీ సఫలం కాకపోవడంతో.. ఇప్పుడు దేవుడిపై భారం వేసేశారు. జాతీయ ప్రార్థన దినోత్సవం సందర్భంగా శుక్రవారం వైట్‌హౌజ్‌లో 'వేదిక్‌ శాంతి పఠనం' పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా ప్రజల ఆరోగ్యం, రక్షణ కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని 'స్వామి నారాయణ్‌ మందిర్‌' పూజారి హరీశ్‌ బ్రహ్మభట్‌ నిర్వహించారు. ప్రార్థనకు ముందు బ్రహ్మభట్‌ మాట్లాడుతూ.. ''ఇది శాంతి కోసం చేసే అద్భుతమైన హిందూ ప్రార్థన. ఇది యజుర్వేదంలో ఓ భాగం. ఈ ప్రార్థన ఒక్క అమెరికాకే కాదు.. స్వర్గానికి, భూమ్యాకాశాలకు, సకల జీవరాశికి, ప్రకృతికి అన్నింటికీ శాంతి చేకూరుస్తుంది'' అని అన్నారు. ప్రార్థనానంతరం ఆయన ఆ సారాంశాన్ని ఆంగ్లంలో బోధించారు.