డిపాజిట్లపై వడ్డీరేట్లకు కోత విధించిన బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)


బిజినెస్ :  బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4.4 శాతం) ఆధారిత గృహ రుణ రేటును 30 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కోవిడ్‌–19 నేపథ్యంలో రుణ గ్రహీతల నుంచీ, రియల్టీ సంస్థల నుంచీ క్రెడిట్‌ రిస్క్‌ (రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యంలో ఇబ్బంది) పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల నుంచి వస్తున్న విశ్లేషణలు ఎస్‌బీఐ తాజా నిర్ణయానికి నేపథ్యమని సంబంధిత ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిని తనఖా పెట్టుకుని ఇచ్చే వ్యక్తిగత రుణాలపై సైతం వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్లమేర ఎస్‌బీఐ పెంచింది. మే 1వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ తెలిపింది.
  ఎస్‌బీఐ తాజా నిర్ణయం బాటలో మిగిలిన బ్యాంకులూ నడిచే అవకాశం ఉంది. గృహ రుణాల్లో భారీ మొత్తం అటు రెపో రేటుకో లేక ఎంసీఎల్‌ఆర్‌కో అనుసంధానమై ఉంటాయి.    మరోపక్క, బెంచ్‌మార్క్‌ రుణ రేటు–ఎంసీఎల్‌ఆర్‌ను స్వల్పంగా 0.15% (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది.   ప్రస్తుతం 7.40% ఉంటే దీనిని 7.25%కి తగ్గించింది. మే 10వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీనిప్రకారం– ఒక వ్యక్తి 30 ఏళ్లలో తీర్చే విధంగా రూ.25 లక్షల గృహ రుణం తీసుకుంటే (ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన వడ్డీ రేటుకు) అతనికి నెలవారీ వాయిదా చెల్లింపులపై దాదాపు రూ.255 భారం తగ్గుతుంది.