విదేశాల నుంచి వస్తున్నవారు, వలస కార్మికులతో పెరుగుతున్న కేసులు

రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,002గా ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 48 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,057కు చేరిందని వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా మరో మరణం నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 58కి చేరింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 9,664 మందికి పరీక్షలు చేయగా 134 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు 66 మంది ఉన్నారని బులెటిన్‌లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 3,117 మందికి చేరింది. కొత్తగా పాజిటివ్‌ వచ్చిన వారిలో కోయంబేడు కేసులు 9 ఉన్నాయి. 
అదుపులోకి వస్తున్న తరుణంలో..
రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తున్న తరుణంలో విదేశాలు నుంచి వస్తున్న ప్రయాణికులు, వలస కార్మికులు, కోయంబేడు కాంటాక్టుల వల్ల కేసులు పెరుగుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసుల్లో వీరి సంఖ్యే అధికంగా ఉంటోంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో 111 మందికి,  వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల్లో 219 మందికి, తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌ ద్వారా 213 మందికి పైగా వైరస్‌ సోకింది. ఈ 543 కేసులు లేకుంటే.. రాష్ట్రంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 2,574గా ఉంటుంది. విదేశాల నుంచి ప్రయాణికులు, వివిధ రాష్ట్రాల వలస కార్మికులు ఏపీలోకి రాగానే క్వారంటైన్‌కు పంపి పరీక్షలు నిర్వహిస్తున్నామని, కాబట్టి వీరి వల్ల ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం లేదని వైద్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.