నెల్లో ఇది రెండవసారి

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అన్ని కాలపరిమితుల స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 40 బేసిస్‌ పాయింట్ల (0.40 శాతం) వరకూ తగ్గించింది. డిపాజిట్లపై ఎస్‌బీఐ రేట్లు తగ్గించడం ఇది వరుసగా రెండవసారి. తాజా నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. రెండు కోట్లు ఆపైబడిన బల్క్‌ డిపాజిట్లపై వడ్డీరేటును బ్యాంక్‌ ఏకంగా 50 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గించడం గమనార్హం. ఈ కేటగిరీ కింద బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తున్న గరిష్ట వడ్డీరేటు మూడు శాతం. ఈ నిర్ణయం కూడా తక్షణం అమలోకి వచ్చింది.
సీనియర్‌ సిటిజన్లకు అదనం..
సీనియర్‌ సిటిజన్లకు పైన పేర్కొన్న వడ్డీరేటు కన్నా అరశాతం (50 బేసిస్‌ పాయింట్లు) అదనంగా అందుతుంది. సీనియర్‌ సిటిజన్ల విషయంలో 50 బేసిస్‌ పాయింట్ల అదనంతోపాటు, మరో 30 బేసిస్‌ పాయింట్ల వడ్డీరేటు ప్రీమియంగా ఇచ్చే ఒక ప్రత్యేక పథకాన్ని ‘ఎస్‌బీఐ వెల్‌ఫేర్‌’ పేరుతో ఇప్పటికే బ్యాంక్‌ ప్రకటించింది. ఐదేళ్లు, ఆపైన డిపాజిట్లకు వర్తించే ఈ పథకాన్ని తీసుకోడానికి గడువు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30.
ఎస్‌ఎంఎస్‌కు ‘ఎస్‌’ అంటే... వాయిదా
కాగా రుణ బకాయిల ఈఎంఐ చెల్లింపులపై మారటోరియం అమలు విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. దీని ప్రకారం... దాదాపు 85 లక్షల మంది అర్హత కలిగిన రుణ గ్రహీతలకు వారి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఎస్‌ఎంఎస్‌ కమ్యూనికేషన్‌కు ప్రతిగా కస్టమర్‌ ‘ఎస్‌’ అని సమాధానం ఇస్తే చాలు... నెలవారీ చెల్లింపులపై మారిటోరియం వారికి అమలవుతుంది.