ప్రముఖ సైట్‌పై ప్రభుత్వ నిషేధం

ప్రముఖ ఫైల్‌ షేరింగ్‌ సైట్‌ ‘వీ ట్రాన్స్‌ఫర్‌.కామ్‌’పై టెలికమ్యూనికేషన్స్‌‌ శాఖ(డాట్‌) నిషేధం విధించింది. జాతి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొద్దిరోజుల క్రితం సైట్‌లోని ఓ మూడు యూఆర్‌ఎల్స్‌ను నిషేధించాలంటూ డాట్‌ ఇంటర్‌నెట్‌ ప్రొవైడర్లకు నోటీసులు జారీచేసింది. అనంతరం మూడవ నోటీసులో సైట్‌ను పూర్తిగా నిషేధించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రముఖ సర్వీస్‌ ప్రొవైడర్లు తమ వినియోగదారులకు ఈ సైట్‌ను‌ అందుబాటులో లేకుండా చేశాయి. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ సైట్‌ను నిషేధించిందో తెలియరాలేదు.కాగా, వీ ట్రాన్స్‌ఫర్‌ సైట్‌కు ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల యూజర్లు ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఈ సైటు భారత్‌లో విపరీతమైన ప్రాచూర్యాన్ని పొందింది. దీని‌ ద్వారా దాదాపు 2జీబీ సైజు గల ఫైళ్లను ‘వీ ట్రాన్స్‌ఫర్‌’లో ఎటువంటి అకౌంట్లు అవసరం లేకుండా ఎదుటి వ్యక్తి ఈ మెయిల్‌కు పంపించవచ్చు. ఉచితంగా ఫైళ్లను పంపించుకునే అవకాశం ఉండటంతో నెటిజన్లు దీనిపై ఎక్కువగా మొగ్గుచూపారు.