పేటీఎం- గ్రోఫర్స్‌ డీల్‌కు సాఫ్ట్‌బ్యాంక్‌ పుష్‌!

జియోమార్ట్‌ ద్వారా ఆన్‌లైన్‌ గ్రోసరీ మార్కెట్‌లోకి డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రవేశించడంతో ఈకామర్స్‌ కంపెనీలలో కన్సాలిడేషన్‌కు మార్గమేర్పడవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా కోవిడ్‌-19 సమస్యతో ఇటీవల ఆన్‌లైన్‌ గ్రోసరీ బిజినెస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్కెట్‌, గ్రోఫర్స్‌, స్పెన్సర్స్‌ వంటి కంపెనీలకుతోడు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తదితరాలు సైతం ఈకామర్స్‌ ద్వారా గ్రోసరీస్‌ విక్రయాలను చేపడుతున్నాయి. కాగా.. ఆన్‌లైన్‌ రిటైలర్‌ పేటీఎంతోపాటు.. గ్రోఫర్స్‌లోనూ పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌ చేసింది. ఆన్‌లైన్‌ బిజినెస్‌లో పోటీ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేటీఎం, గ్రోఫర్స్‌ మధ్య విలీనం లేదా డీల్‌ కుదరితే ప్రయోజనకరంగా ఉంటుందని సాఫ్ట్‌బ్యాంక్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు కంపెనీల మధ్య చర్చలకు తెరతీసినట్లు సంబంధివర్గాలు చెబుతున్నాయి.
పెట్టుబడులు ఇలా
జపనీస్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ అటు పేటీఎం మాల్‌, ఇటు గ్రోఫర్స్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసింది. వెరసి ఈ రెండు కంపెనీలలో తాజాగా ఎలాంటి పెట్టుబడి ప్రణాళికలనూ అమలు చేయడంలేదని తెలుస్తోంది. ఇప్పటికే సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ ద్వారా పేటీఎం మాల్‌లో 20 శాతం వాటాను సాఫ్ట్‌బ్యాంక్‌ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ ద్వారా గ్రోఫర్స్‌లో 40 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈకామర్స్‌ రిటైలర్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న పేటీఎం, ఆన్‌లైన్‌ గ్రోసరీస్‌ విక్రేత అయిన గ్రోఫర్స్‌ మధ్య డీల్‌ కుదిరితే రెండు కంపెనీలకూ ప్రయోజనం చేకూరడంతోపాటు.. పెట్టుబడులు వృద్ధి చెందే వీలున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్‌ ఆశిస్తోంది. దీంతో ఈ రెండు కంపెనీల మధ్య వ్యూహాత్మక డీల్‌కు తెరతీసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పేటీఎం మాల్‌లో అలీబాబాకు 35 శాతం వాటా ఉంది. సైఫ్‌ పార్టనర్స్‌, ఈబే, సీఈవో విజయ్‌ శంకర్‌ శర్మ సైతం వాటాలను కలిగి ఉన్నారు. కాగా.. మరోపక్క మిల్క్‌ డెలివరీ స్టార్టప్‌ మిల్క్‌ బాస్కట్‌లో పెట్టుబడికి పేటీఎం మాల్‌ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ బాటలో ఆన్‌లైన్‌ గ్రోసరీ విక్రయాలను సైతం జత చేసుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మిల్క్‌ బాస్కట్‌లో కలారీ కేపిటల్‌, మేఫీల‍్డ్‌ తదితర సంస్థలు ఇన్వెస్ట్‌ చేశాయి.