సుదీర్ఘమైన లాక్డౌన్ తర్వాత మహానగరంలో బతుకు బండి కదిలింది. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్‌మాల్స్ మినహా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు మొదలయ్యాయి. మెకానిక్ షాపుల మొదలు చెప్పుల దుకాణాల వరకు అన్నీ తెరుచుకున్నాయి. ఆటోలు, ట్యాక్సీలు, తదితర వాహనాలన్నీ రోడ్డెక్కాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
లాక్‌డౌన్‌తో 2 నెలలుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వ్యాపార కార్యకలాపాలు నెమ్మదిగా మొదలయ్యాయి. లాక్డౌన్ దృష్ట్యా మందుల షాపులు, కిరాణా షాపులు, పాలు, పండ్లు, కూరగాయలు వంటి వాటికే అనుమతిచ్చారు. ఆ తర్వాత రెండోదశలో నిర్మాణ రంగానికి చెందిన వస్తు విక్రయాలకు సడలింపు లభిం చింది. వైన్స్ సైతం తెరుచుకున్నాయి. ఎలక్ట్రానిక్స్ షాపులు, ఆటోమొబైల్ షోరూంలకు అనుమతిచ్చారు.
తాజాగా ప్రజలు ఎక్కువగా గుమి గూడేందుకు అవకాశం ఉన్న మాల్స్, సినిమా హాల్స్, హోటళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు మినహా అన్నింటికీ అనుమతివ్వడంతో వస్త్ర దుకాణాలు సహా అన్నీ తెరుచుకున్నాయి. వివిధ అవసరాల కోసం జనం పెద్ద ఎత్తున బయట కొచ్చారు. ఆటోలు, క్యాబ్‌లు సైతం అందుబాటులోకి రావడంతో ప్రజా రవాణా సదుపాయాలు సైతం పాక్షికంగా అందుబాటులోకి వచ్చినట్లయింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్‌లపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.