ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ‘‘ఎంఫాన్‌’’


ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ‘‘ఎంఫాన్‌’’  తుఫాను వాయువ్య దిశగా ప్రయాణించి తీవ్ర తుఫానుగా మారింది. ఆదివారం ఉదయం 08.30 గంటలకు తీవ్ర తుఫానుగా మారి అదే ప్రాంతంలో పారదీప్(ఒరిస్సా)కు దక్షిణ దిశగా 990 కి.మీ, డిగా(పశ్చిమ బెంగాల్) కు దక్షిణ నైఋతి దిశగా 1140 కి.మీ, ఖేపుపర(బంగ్లాదేశ్)కు దక్షిణ నైఋతి దిశగా 1260 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత తీవ్రమై రాగల 12 గంటలలో అతి తీవ్రతుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది తదుపరి 24 గంటలలో ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీరాల వద్ద  సాగర దీవులు(పశ్చిమ బెంగాల్), హతియా దీవులు(బంగ్లాదేశ్) మధ్య మే 20 వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది.

దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రాలలో కొన్ని ప్రాంతాలకు ఈరోజు (మే 17 వ తేదీన) నైఋతి రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించారు. రాగల 48 గంటలలో దక్షిణ బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులలో మిగిలిన ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు.