ఎఫ్‌డీలపై వడ్డీరేటు తగ్గించిన ఐసీఐసీఐ

కరోనా కాలంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ తాజాగా తన కస్టమర్లకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. వివిధ కాల పరిమితుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 50 బేసిస్ పాయింట్ల వకు కోత విధించినట్లు బ్యాంక్ తెలిపింది. సవరించిన రేట్లు మే 11 నుంచే అమలులోకి వచ్చినట్టు పేర్కొంది. 
ఐసీఐసీఐ బ్యాంక్ తాజా రేట్ల కోత నిర్ణయంతో ఏడాది కాల పరిమితి డిపాజిట్లపై ఇప్పుడు 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. అదే ఏడాది పైన కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 5.7- 5.75 శాతం మధ్య వడ్డీని చెల్లించనుంది. మరోవైపు రుణరేట్ల (ఎంసీఎల్‌ఆర్‌)  ను కూడా తగ్గించే అవకాశం వుందని భావిస్తున్నారు. అటు నిరాశాజనక ఫలితాలతో స్టాక్‌మార్కెట్లో బ్యాంకు షేరు 2 శాతానికిపైగా నష్టపోయింది. కాగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు కోత విధించిన సంగతి తెలిసిందే.