రెండో రోజునే తేరుకున్న విశాఖ నగరం

విశాఖ :  ఎల్‌జీ పాలిమర్స్‌లో గురువారం వేకువజామున విషవాయువు లీకేజీతో ఉక్కిరిబిక్కిరైన విశాఖ ఉక్కునగరం రాష్ట్ర ప్రభుత్వ సత్వర చర్యలతో రెండో రోజునేఊపిరిపీల్చుకుంది. ముఖ్యమంత్రి  ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితిపై ఆరా తీస్తూ తగిన ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో ఒక్కరోజులోనే ఇక్కడి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.బాధితులకు సీఎం ప్రకటించిన నష్టపరిహారం కింద ప్రభుత్వం 24 గంటల్లోనే రూ.30 కోట్లను విడుదల చేసింది.

ఒక్కో మృతుని కుటుంబానికి రూ.కోటి చొప్పున.. వెంటిలేటర్లపై ఉన్న వారికి రూ.10 లక్షల చొప్పున తక్షణమే పరిహారం అందజేయాలని ఉత్తర్వులు జారీచేసింది. గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై కారణాలను నిగ్గుతేల్చేందుకు ఉన్నతస్థాయి (హైపవర్‌) కమిటీని కూడా నియమించింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడంతోపాటు ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిఫార్సు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ నెలరోజుల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది. సూచనల కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు లేదా నిపుణులను సహాయకులుగా కమిటీ చైర్మన్‌ నియమించుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు.. విషవాయువు కారణంగా గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన వారు క్రమంగా కోలుకుంటున్నారని.. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం హుటాహుటిన చర్యలు తీసుకోవడంతో రెండోరోజునే నగరంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని మంత్రులు ఆళ్ల నాని, ముత్తంశెట్టి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.

వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మొత్తం 554 మందిలో 128 మంది శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారని.. మిగిలిన వారెవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ఇక ప్రమాదం జరిగిన స్థానిక గ్రామాల ప్రజలకు ఎటువంటి లోటు రానీయకుండా ప్రభుత్వం పెద్దఎత్తున ఆపన్న హస్తం అందిస్తోంది. పునరావాస కేంద్రాల్లో దాదాపు 15 వేల మందికి వసతి, నాణ్యమైన భోజనం ఏర్పాటుచేస్తున్నారు. జీవిఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. గ్యాస్‌ లీకేజి వల్ల జరిగిన నష్టానికి మధ్యంతర పరిహారంగా రూ.50 కోట్లను విశాఖ కలెక్టర్‌ వద్ద డిపాజిట్‌ చేయాలని ఎల్‌జీ పాలిమర్స్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశించింది. కంపెనీ నుంచి లీక్‌ అవుతున్న గ్యాస్‌లో గాఢతను, విష ప్రభావాన్ని దాదాపుగా తగ్గించడంలో నిపుణుల బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఖాళీచేసిన కంపెనీ పరిసర ఐదు గ్రామాల్లోకి ప్రజలను మరో రెండు రోజుల వరకూ ముందుజాగ్రత్త చర్యగా అనుమతించవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఆదేశించారు.