కరోనా దాటికి కుదేలవుతున్న ప్రపంచ మార్కెట్లు : సుమారు 100 లక్షల కోట్ల నష్టాలు

బిజినెస్ : ప్రపంచ మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్‌ కూడా భారీ నష్టాల్లో ఆరంభమైంది. రోజంతా స్టాక్‌ సూచీల క్షీణత కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మరింతగా పెరగడంతో నష్టాలు కూడా మరింతగా పెరిగాయి.  క్యాపిటల్‌ గూడ్స్, మీడియా,హెల్త్‌కేర్, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, లోహ, ఆర్థిక, ఇంధన, బ్యాంక్,   టెలికం షేర్లు నష్టపోయాయి.   ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆర్థిక ప్యాకేజీ ఉసూరుమనిపించడంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. ప్రపంచ మార్కెట్లు పతనమవడం, ముడి చమురు ధరలు 4% మేర ఎగబాకడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం.....ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 32,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 955 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్‌ చివరకు 886 పాయింట్ల నష్టంతో 31,123  వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 241 పాయింట్లు క్షీణించి 9.143 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 2.77 శాతం, నిఫ్టీ 2.57 శాతం చొప్పున నష్టపోయాయి.