లాక్‌డౌన్‌లో బ్యాంకుల ఆఫర్లు


కరోనా వైరస్‌ కట్టడికి సంబంధించిన లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ బ్యాంకులు వినూత్న ఆఫర్లతో తమ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఔషధాలను తమ కార్డులతో కొనుగోలు చేస్తే 15 శాతం దాకా డిస్కౌంట్‌ ఇస్తామంటూ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) ఆఫర్‌ ఇచ్చింది. ‘ఈ కష్టకాలంలో ఫార్మసీ బిల్లుల భారం కాస్త తగ్గించుకునేందుకు సులభతరమైన మార్గం ఉంది. మీకు సమీపంలోని అపోలో ఫార్మసీ స్టోర్‌లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా 15 శాతం దాకా డిస్కౌంటు పొందండి‘ అని  ట్వీట్‌ చేసింది. అటు  ఎస్‌బీఐ కూడా ఇలాంటి ఆఫరే ఇచ్చింది.

‘అపోలో 24/7 నుంచి హెల్త్‌ చెకప్‌ చేయించుకోండి. యోనో ఎస్‌బీఐ యాప్‌ ద్వారా కొన్ని ల్యాబ్‌ టెస్టులపై ఆకర్షణీయ డిస్కౌంట్లు పొందండి‘ అని పేర్కొంది. అటు, అక్షయ తృతీయ రోజున తమ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసిన వారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆఫర్‌ ఇచ్చింది. రూ. 10,000 విలువ పైబడిన ప్రతీ కొనుగోలుపై 5 రెట్లు రివార్డ్‌ పాయింట్లు ఇస్తామని, పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ. 100 విరాళంగా ఇస్తామని తెలిపింది. ఇక బ్యాంకులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిబంధనలను కూడా సడలించాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకున్నా జూన్‌ 30 దాకా ఎటువంటి చార్జీలు విధించబోమంటూ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ కస్టమర్లకు ఆఫరిచ్చింది.