తమను అలా గుర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా..

తమ భూభాగం నుంచి తైవాన్‌ను వేరు చేసే ఏ చర్యను తాము ఎన్నటికీ సహించబోమని చైనా హెచ్చరికలు జారీ చేసింది. చైనా అంతర్గత వ్యవహారాలు, రాజకీయాల్లో బాహ్య శక్తుల ప్రమేయాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. తైవాన్‌ అధ్యక్షురాలిగా జనవరిలో రెండోసారి ఎన్నికైన డాక్టర్‌ త్సాయి ఇంగ్‌‌- వెన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ... ‘‘ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజాస్వామ్య విలువలకు, స్వాతంత్ర్య కాంక్షకు కట్టుబడే ఉన్నాం. బీజింగ్‌ అధికారులు చెప్పే మాటలను తైవాన్‌ ఎన్నటికీ అంగీకరించబోదు. మన సార్వభౌమత్వాన్ని కాలరాసే హక్కు ఎవరికీ ఇవ్వదు’’ అని చైనా తీరుపై విమర్శలు సంధించారు. అదే సమయంలో సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇక త్సాయి ఇంగ్‌-వెన్‌ వ్యాఖ్యలపై చైనా తైవాన్‌ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మా జియోగాంగ్‌ స్పందించారు. ‘‘జాతీయ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకునే శక్తి మాకు ఉంది. వేర్పాటువాద కార్యకర్తలు, చైనా నుంచి తైవాన్‌ను విడదీయాలనే బాహ్య శక్తులను సహించే ప్రసక్తే లేదు. శాంతియుతమైన పునర్‌కలయికకు.. ఒక దేశం- రెండు విధానాల పద్ధతికి మేం కట్టుబడి ఉన్నాం’’అంటూ హాంగ్‌హాంగ్‌పై ఆధిపత్య చెలాయిస్తున్న తీరును తైవాన్‌లోనూ అమలు చేస్తామన్న సంకేతాలు ఇచ్చారు.