నగరంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 48మంది మృతి చెందగా, వీరిలో 42మంది గ్రేటర్ వాసులే కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం మరో ముగ్గురు మృతి చెందారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం కేసుల సంఖ్య తగ్గక పోగా..మరింత పెరుగుతుండటం గ్రేటర్‌వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1699 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గ్రేటర్‌లోనే 1146 పాజిటివ్ కేసులు ఉన్నాయి. తాజాగా శుక్రవారం ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో కొత్తగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న 9 మంది అడ్మిట్ అయ్యారు. నెగిటివ్ వచ్చిన ఐదుగురిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 11 మంది అనుమానితులు ఉన్నారు. వీరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఫీవర్ ఆస్పత్రిలో 12 మందిని ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేసుకున్నారు. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది.
బీఎన్‌రెడ్డి నగర్లో వృద్ధురాలికి పాజిటివ్
ఎల్బీనగర్: బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లోని ఈ– సేవా సమీపంలో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలికి (71) కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అమెకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఏడుగురిని పరీక్షల నిమిత్తం కింగ్‌కోఠి ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇంటి పరిసరాల్లో శానిటైజేషన్ చేశారు.