రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో విదేశీ సంస్థ భారీగా పెట్టుబడులు

రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో విదేశీ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.34 శాతం వాటా కోసం అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ, జనరల్‌ అట్లాంటిక్‌ రూ.6,598 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నది. నాలుగు వారాల్లో ఇది నాలుగో డీల్, ఈ నాలుగు ఒప్పందాల ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.67,195 కోట్ల పెట్టుబడులు వస్తాయి.  జనరల్‌ అట్లాంటిక్‌ డీల్‌ పరంగా చూస్తే, జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగాను, ఎంటర్‌ప్రైజ్‌  విలువ రూ.5.16 లక్షల కోట్లుగానూ ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది.
మరిన్ని డీల్స్‌: కాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటిదాకా 14.8% వాటా ను విక్రయించింది. వ్యూహాత్మక, ఫైనాన్షియల్‌ ఇన్వెస్టర్లకు 20% వాటాను ఈ కంపెనీ విక్రయించనున్నదని సమాచారం. అందుకని భవిష్యత్తులో మరిన్ని డీల్స్‌ ఉండొచ్చని అంచనా.   వచ్చే ఏడాది మార్చికల్లా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ గత ఏడాది ఆగస్టులో పేర్కొన్నారు. తాజా డీల్స్‌తో పాటు  రూ.53,125 కోట్ల రైట్స్‌ ఇష్యూ ద్వారా ఈ లక్ష్యం ఈ ఏడాది డిసెంబర్‌కే సాకారం కానున్నది. మార్చి నాటికి రిలయన్స్‌ నికర రుణ భారం రూ.1,75,259 కోట్లు.