మైనార్టీల పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరుపై అగ్రరాజ్యం అమెరికా మండిపడింది. అల్ప సంఖ్యాక వర్గాలపై అణచివేత ధోరణి అవలంబించేందుకు వీలుగా చైనా తరఫున గూఢచర్యం నెరపుతున్నాయన్న ఆరోపణలతో 33 చైనీస్ సంస్థలను ఎకనమిక్ బ్లాక్‌లిస్టులో చేర్చింది. సదరు సంస్థలు చైనా మిలిటరీతో సంబంధాలు కలిగి ఉన్నాయని, మైనార్టీల ప్రయోజనాలు కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘‘ఉగర్ల(షింజియాంగ్‌లోని తెగ) సామూహిక నిర్బంధం, శ్రమదోపిడి, అత్యాధునిక సాంకేతికతతో వారిపై నిఘా వేసేందుకు చైనా చేపట్టిన అణచివేత కార్యక్రమంలో భాగస్వామ్యమైన ఈ కంపెనీలు మానవ హక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి’’అని అమెరికా వాణిజ్య విభాగం రాయిటర్స్‌తో పేర్కొంది. ఎకనమిక్ బ్లాక్‌లిస్టులో పెట్టిన కనీసం ఏడు టెక్నాలజీ కంపెనీలు ఉండగా.. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉన్నట్లు వెల్లడించింది.
కాగా సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న హాంకాంగ్‌ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని అక్కడ అమలు చేసే ముసాయిదా బిల్లుకు చైనా పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో బిల్లు చట్టరూపం దాల్చితే హాంకాంగ్ స్వయంప్రతిపత్తి కోల్పోయే అవకాశం ఉంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో డ్రాగన్ ఈ మేరకు పావులు కదుపుతోంది. అదే విధంగా తైవాన్‌పై సైతం హాంకాంగ్ మాదిరి పెత్తనం చెలాయించేందుకు వ్యూహాలు రచిస్తోంది. అంతేగాకుండా సరిహద్దుల్లో పొరుగు దేశాల సైన్యాన్ని పదే పదే రెచ్చగొడుతూ దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తోంది.