నగరంలో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య

గ్రేటర్‌లో కరోనా విస్తృతి ఆగడం లేదు. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం, అదే స్థాయిలో మరణాలు నమోదవుతుండటంతో నగరవాసు లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం గ్రేటర్‌ పరిధిలో 58 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 2098 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,  ఒక్క గ్రేటర్‌ లోనే 1352 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం విశేషం. ఇప్పటి వరకు 63 మంది మృతి చెందగా, వీరిలో 53 మంది సిటిజన్లే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ నెలలో కేవలం 27 రోజుల్లో 31 మంది మృతి చెందడం గమనార్హం.
ఐడిహెచ్‌ కాలనీలో ముగ్గురికి..
బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ ఐడిహెచ్‌ కాలనీలో ముగ్గురికి  పాజిటివ్‌గా తెలింది. కాలనీకి చెందిన రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి(67) పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడి భార్య కుమారుడికి కూడా పరీక్షలు నిర్వహించగా కుమారుడు(24)కి పాజిటివ్‌ వచ్చింది.  అదే బ్లాక్‌లో ఉంటున్న జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలో  ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న యువకుడు(34)కి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐడిహెచ్‌ కాలనీలో కంటైన్‌మెంట్‌ ఏర్పాటు చేశారు.  
దూద్‌బావిలో ఒకరికి పాజిటివ్‌  
చిలకలగూడ : మెట్టుగూడ డివిజన్‌ దూద్‌బావికి చెందిన వ్యక్తి (48)   టైలర్‌గా పని చేసేవాడు ఈ నెల 26న జ్వరం, జలుబు, దగ్గు రావడంతో వెద్యులు కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. గాంధీ ఆస్పత్రిలో నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్‌ వచ్చింది.