ఈసారి నీవల్ల కాదులే బాస్‌

భారత క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా, కీపర్‌గా తనదైన ముద్రను వేశాడు ఎంఎస్‌ ధోని.  దాదాపు ఏడాది క్రితం భారత తరఫున చివరిసారి కనిపించిన ధోని.. మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడతాడో.. లేదో అనే విషయం మాత్రం అతనికే తెలియాలి. ఇప్పటి వరకూ తన రీఎంట్రీపై ఎటువంటి స్పష్టతా ఇవ్వని ధోని.. రాబోవు టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటాడా.. లేదా అనే దానిపై నేటికి క్లారిటీ లేదు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ధోని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్న టీమిండియా ఇంకా అన్వేషణలోనే ఉంది. 

కాగా, వికెట్ల వెనుక నుంచి రెప్పపాటులో బెయిల్స్‌ని ఎగరగొట్టడంలో ఎంఎస్‌ ధోని తర్వాతే ఎవరైనా అనేది వాస్తవం. బ్యాట్స్‌మెన్ పాదాల కదలికల్ని నిశితంగా పరిశీలించే ధోని స్టంపౌట్‌లు చేయడంలో సిద్ధహస్తుడు. కానీ 2019 వన్డే ప్రపంచకప్‌‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ షబ్బీర్ రెహ్మాన్‌ని స్టంపౌట్ చేయడంలో ధోని తడబడ్డాడు. అంతకుముందు 2016 టీ20 వరల్డ్‌కప్‌లో షబ్బీర్‌ను స్టంపౌట్‌ చేసిన ధోని.. 2019 వరల్డ్‌కప్‌లో చాన్స్‌ లభించినా దాన్ని మిస్సయ్యాడు. దీన్ని గుర్తు చేసుకున్నాడు షబ్బీర్‌ అలీ. ఫేస్‌బుక్‌ లైవ్‌ సెషన్‌లో భాగంగా  గత జ్ఞాపకాలను షబ్బీర్‌ పంచుకున్నాడు. ‘‘ఆ మ్యాచ్‌లో నేను తెలివిగా మళ్లీ క్రీజులోకి రాగలిగాను. దాంతో.. ధోని వైపు చూసి ఈరోజు నీది కాదు అని చెప్పా’’ అని షబ్బీర్ వెల్లడించాడు. ఆ మ్యాచ్‌‌లో  షబ్బీర్ 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్‌ కాగా, టీమిండియా 28 పరుగుల తేడాతో గెలిచింది. ఇక 2016 టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ పరుగు తేడాతో మాత్రమే గెలిచింది.