బర్త్‌డేల పేరుతో పార్టీలు ఏర్పాటు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు అదుపులో ఉన్న వైరస్.. తాజాగా మరింత విజృంభిస్తున్నది. మర్కజ్, ఎన్నారై మూలాలు లేని కుటుంబాల్లో వైరస్ తీవ్ర రూపం దాల్చుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాల్లో కొత్తగా నమోదవుతున్న ఈ కేసుల మూలాలు అధికారులకు సైతం అంతు చిక్కడం లేదు.
వైద్యుల సూచనలు బేఖాతార్...
మర్కజ్ మూలాలు అధికంగా ఉన్న పాతబస్తీలో వైరస్ దాదాపు నియంత్రణలోకి వచ్చింది. గడచిన పదిహేను రోజులుగా ఇక్కడ కేసులు కూడా పెద్దగా నమోదు కావడం లేదు. ప్రస్తుతం ఏ మూలాలు లేని శివారు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న ఈ కేసులకు ఆయా ప్రాంతాల్లోని వైన్‌షాపులు, కిరాణా షాపులు, నిత్యావసరాలు, కూరగాయల మార్కెట్లే కేంద్ర బిందువని అధికారులు చెబుతున్నారు. మార్కెట్లోకి వచ్చే ముందు మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, కొనుగోలు చేసిన కాయకూరలు, ఇతర వస్తువులను రెండు మూడు గంటల వరకు ఇంట్లో ఎవరూ ముట్టుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కానీ నగరవాసులు ఈ సూచనలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా వైరస్ బారిన పడుతున్నారు.