కరోనా సోకిన గర్భిణీ...విజయవంతంగా డెలివరీ చేసిన వైద్యులు


కరోనా తో బాధపడుతున్న నిండు గర్భిణికి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు పురుడుపోసి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడారు. కరోనా సోకిన గర్భిణీకి డెలివరీ చేయడం గాంధీ ఆస్పత్రిలో ఇది రెండోసారి. ఆస్పత్రి వైద్యవర్గాలు తెలిపిన వివరాల ప్రకారం బహుదూర్‌పురాకు చెందిన గర్భిణి (30)కి కరోనా సోకడంతో ఈ నెల 10న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు ఇది ఆరవ కాన్పు కావడం, అధిక రిస్క్, పీపీహెచ్‌ కాంప్లికేషన్లు ఉండటంతో ఈ కేసును ఆస్పత్రి వైద్యులు సవాల్‌గా తీసుకున్నారు. 

గర్భిణితోపాటు కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి అపాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు. సాధారణ డెలివరీకి అవకాశం లేకపోవడంతో బుధవారం సిజేరియన్‌ శస్త్రచికిత్స నిర్వహించి పండంటి మగశిశువును బయటకు తీశారు. శిశువు 3 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడని, తల్లి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు. మహిళకు కరోనా పాజిటివ్‌ కావడంతో పుట్టిన శిశువుకు తల్లిపాలు ఇవ్వడంలేదు.