ఏపీలో 18 రైల్వేస్టేషన్లలో హెల్త్‌ ప్రొటోకాల్‌

దాదాపు 71 రోజుల తర్వాత రైళ్లు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ప్రధాన రైల్వేస్టేషన్లు సందడిగా మారాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రైల్వేస్టేషన్లకు చేరుకున్నారు. రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవాలన్న నిబంధన మేరకు ముందే తరలివచ్చారు. స్టేషన్‌లలో ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు. ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపించారు. ప్రయాణం పూర్తయ్యేవరకు ప్రయాణికులు మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కడప, గుంతకల్‌ ఇలా ప్రధాన స్టేషన్‌లన్నీ కళకళలాడాయి. ఈ నెల 29 నుంచి తత్కాల్‌ టికెట్లను కూడా జారీ చేయనున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల నుంచి సోమవారం వివిధ ప్రాంతాలకు 9 రైళ్లు బయలుదేరాయి.
► హైరిస్క్‌ ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక పరీక్షలు చేసి వారం పాటు క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం మరో వారం హోం క్వారంటైన్‌లో ఉండాలని నిబంధనలు విధించారు. 
► చెన్నై, ముంబై, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌లను హైరిస్క్‌ ఉన్నవిగా గుర్తించారు. 
► ఏపీ హెల్త్‌ ప్రొటోకాల్‌ను ప్రకటించిన 18 స్టేషన్లలో దిగే ప్రయాణికుల్లో ప్రతి కంపార్ట్‌మెంట్‌లో 5 శాతం మందికి స్వాబ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 60 ఏళ్లు పైన చిన్నారులు, పదేళ్ల లోపు ఉన్నవారు, గర్భిణులు, అస్వస్థతకు గురైన వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌కు అనుమతిస్తున్నారు. వీరికి రైల్వే స్టేషన్లలోనే స్వాబ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 
► విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మెడికల్‌ ప్రొఫెషనల్స్‌కు ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే.. వారు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) గుర్తించిన ల్యాబ్‌ నుంచి కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ చూపించాల్సి ఉంటుంది.