నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై నేటినుంచి ప్రత్యేక దృష్టి

నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై నేటినుంచి ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సీఎం కేసీఆర్‌ సూచనలకనుగుణంగా జూన్‌ 1 నుంచి (సోమవారం) 8వ తేదీ వరకు గ్రేటర్‌ పరిధిలోని 150 వార్డుల్లో స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి నివారణకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా రోడ్ల వెంబడి, ఓపెన్‌ ప్లాట్లలో చెత్తాచెదారాన్ని తొలగించనున్నారు. నాలాలు, నీటి నిల్వ ప్రాంతాల్లో డీసిల్టింగ్, పిచ్చిమొక్కలు, గుర్రపుడెక్కను, రహదారులు, ఓపెన్‌ ప్లాట్లలోని కన్‌స్ట్రక్షన్, డిమాలిషన్‌ వ్యర్థాలు తదితరాలను తొలగించనున్నారు. ఆయా కార్యక్రమాల అమలు కోసం వార్డుల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు కమిషనర్‌ తెలిపారు. ఇందులో భాగంగా  పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాల కోసం అన్ని వార్డులనూ మ్యాపింగ్‌ చేయడంతో పాటు తగినన్ని వాహనాలను సమకూర్చి అవసరమైన సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాలను డిప్యూటీ, జోనల్‌ కమిషనర్లు పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని, అవసరానికనుగుణంగా అదనపు సిబ్బంది, వాహనాలను సమకూర్చనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. 
నిరాడంబరంగా అవతరణ వేడుకలు  
జూన్‌ 2వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని జోనల్, సర్కిల్‌ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ తదితర కార్యక్రమాలను ఎలాంటి ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా నిర్వహించాలని కమిషనర్‌ జోనల్, డిప్యూటీ కమిషనర్లకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సూచించారు. కోవిడ్‌– 19 నివారణ నిబంధనలకనుగుణంగా మాస్కులు, భౌతిక దూరం పాటించడం, శానిటైజింగ్‌ స్ప్రే, శానిౖటైజర్లు అందుబాటులో ఉంచడం వంటివి అమలు చేయాలన్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు పతాకావిష్కరణ చేయాలని సూచించారు.