భారత్‌ సహా పలు దేశాల విధానాలపై విచారణ

అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పలు దేశాలు అనుచిత డిజిటల్‌ సర్వీస్‌ ట్యాక్స్‌లు విధిస్తున్నాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌తో పాటు పలు దేశాలు విధిస్తున్న డిజిటల్‌ సర్వీస్‌ పన్నులపై (డీఎస్‌టీ) విచారణ జరపాలని నిర్ణయించింది. ఆస్ట్రియా, బ్రెజిల్, చెక్‌ రిపబ్లిక్, యూరోపియన్‌ యూనియన్, ఇండోనేసియా, ఇటలీ, స్పెయిన్, టర్కీ, బ్రిటన్‌ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ‘మా సంస్థలను అసమంజసంగా టార్గెట్‌ చేసుకుని కొన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలు అమలు చేస్తున్న పన్నుల స్కీమ్‌లపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
మా వ్యాపార సంస్థలు, ఉద్యోగులపై ఎలాంటి వివక్ష చూపినా తగు చర్యలు తీసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం‘ అని అమెరికా వాణిజ్య ప్రతినిధుల సంస్థ (యూఎస్‌టీఆర్‌) పేర్కొంది. వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్‌ 301 కింద ఈ విచారణ జరపాలని అమెరికా నిర్ణయించింది. దీని ప్రకారం అమెరికా వాణిజ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపేలా ఇతర దేశాలు వివక్షాపూరిత, అసమంజస విధానాలేమైనా అమలు చేస్తేవిచారణ జరిపేందుకు యూఎస్‌టీఆర్‌కు విస్తృత అధికారా లు ఉంటాయి. దీనిపై ఫెడరల్‌ రిజిస్టర్‌ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఏప్రిల్‌ 1 నుంచి డీఎస్‌టీ అమల్లోకి..
డిజిటల్‌ ట్యాక్స్‌ అంశం కొన్నాళ్లుగా అంతర్జాతీయంగా నలుగుతూనే ఉంది. దీనికి ప్రత్యామ్నాయంపై చర్చలు జరిగినప్పటికీ దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి వివిధ రకాలుగా దేశాలు ఏకపక్షంగా డిజిటల్‌ ట్యాక్స్‌ను విధించడం ప్రారంభించాయి. 2019లో ఫ్రాన్స్‌ ఇలాగే అమెరికా ఉత్పత్తులపై డీఎస్‌టీ విధించింది. ప్రతిగా అమెరికా కూడా కొన్ని ఫ్రెంచ్‌ ఉత్పత్తులపై మరింత అధిక స్థాయిలో పన్నులు వడ్డించింది. దీంతో డీఎస్‌టీని నిలుపుదల చేసిన ఫ్రాన్స్‌ బహుళపక్ష చర్చలు ప్రారంభించింది.
భారత్‌ విషయానికొస్తే ఆన్‌లైన్‌లో వస్తు, సేవలు విక్రయించే విదేశీ కంపెనీలపై రెండు శాతం డీఎస్‌టీ విధించాలని ఈ ఏడాది తొలినాళ్లలో ప్రభుత్వం నిర్ణయించింది.  2020–21 బడ్జెట్‌లో చేసిన ఈ ప్రతిపాదనల కింద రెండు డజన్లకు పైగా విదేశీ టెక్‌ కంపెనీలు ఈ పన్నుల పరిధిలోకి వస్తాయి. సుమారు 2,67,000 డాలర్ల వార్షికాదాయాలు ఉన్న కంపెనీలకు మాత్రమే దీన్ని వర్తింపచేస్తూ ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తొలి విడత చెల్లింపులు కంపెనీలు జూలై 7న కట్టాల్సి ఉంది. గడువు దగ్గరపడుతుండటంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇప్పటికే వసూళ్లపై కసరత్తు చేస్తున్నారు.