కేటీఆర్‌కు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసులు

జీవో 111కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్‌ అక్రమంగా ఫామ్‌ హౌస్‌ నిర్మిస్తున్నారని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జీటీ చెన్నై ధర్మాసనం కేటీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నిర్మాణాలను పరిశీలించి ఇవి సక్రమమా కాదా తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర పర్యావరణ రిజిస్ర్టీ కార్యాలయం, కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, హెచ్‌ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ల సారథ్యంలో ఏర్పాటయ్యే ఈ కమిటీ రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 2018లో 111 జీఓ కేసు విషయంలో ఎన్‌జీటీ ఆదేశాలను యథాతథంగా అమలుచేస్తున్నారా అనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలించాలని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోరింది.