రోజంతా ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు

చిట్టచివరికి ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 129 పాయింట్లు క్షీణించి 33,981 వద్ద నిలవగా.. 32 పాయింట్లు నీరసించిన నిఫ్టీ 10,029 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్‌ 34,000 పాయింట్ల మైలురాయి దిగువన స్థిరపడింది. ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందినప్పటికీ ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ నేలచూపులకే  పరిమితమయ్యాయి. ఎంపిక చేసిన కౌంటర్లలో తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. వెరసి సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 34,310 వద్ద గరిష్టాన్ని, 33,711 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 10,124- 9944 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది.
పీఎస్‌యూ బ్యాంక్స్‌ ప్లస్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 4-1 శాతం మధ్య పుంజుకోగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 3 శాతం, రియల్టీ 2 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌, కొటక్‌ మహీంద్రా, యాక్సిస్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 4.7-2.4 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే వేదాంతా, ఎయిర్‌టెల్‌, జీ, టెక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా, విప్రో, సిప్లా, హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌ 7.7-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి.