షమీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా

టీమిండియా స్టార్‌ బౌలర్‌ షమీమ తన గొప్పమనసు చాటుకున్నాడు. కాలినడకన స్వస్థలాలకు వెళుతున్న వలసకార్మికులకు మాస్క్‌లు, ఆహారాన్ని అందించాడు. ఉత్తరప్రదేశ్‌లోని సాహస్‌పూర్‌కు చెందని షమీ తన ఇంటి దగ్గర వలసదారుల కోసం సహాయక శిబిరాన్ని ప్రారంభించి తన వంతు సాయాన్ని అందిస్తున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో పేర్కొంది. అంతేకాకుండా వలసదారులకు షమీ సహాయం అందిస్తున్న వీడియోను కూడా బీసీసీఐ షేర్‌ చేసింది. ప్రసుత్తం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. అంతేకాకుండా షమీ గొప్ప మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. 

కరోనా  కారణంగా క్రికెట్‌ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ ఆపత్కాలంలో భారత ఆటగాళ్లు తమవంతు సాయాన్ని అందిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న వేళ త్వరలోనే ఆటగాళ్లు మైదానంలోకి దిగే అవకాశం ఉంది. తొలుత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, ట్రైయినింగ్‌ సెషన్స్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడే అవకాశం ఉండటంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)పై అభిమానుల్లో ఆటు ఆటగాళ్లలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.  టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్‌ నిర్వహించే అవకాశం ఉందని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.