తండ్రి కాబోతున్న హార్దిక్‌

భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తండ్రి కాబోతున్నాడు. తన కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందని ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పాండ్యా ప్రకటించాడు. జనవరి 1న దుబాయ్‌లో సెర్బియా నటి, మోడల్‌ అయిన నటాషా, పాండ్యా నిశ్చితార్థం జరిగింది. అయితే ఆదివారమే విడుదల చేసిన మరో ఫొటోలో పాండ్యా, నటాషా పూలదండలతో కనిపిస్తున్నారు. అయితే ఇది పెళ్లికి సంబంధించిన ఫొటోనా కాదా అనే విషయంపై స్పష్టత లేదు. ‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది’ అని నటాషాతో కలిసి దిగిన ఫొటోలను పాండ్యా పోస్ట్‌ చేశాడు. గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు.  ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టి20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.