బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామంచంద్రారెడ్డి కరోనా  బారినపడ్డారు. ఆదివారం కరోనా లక్షణాలతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన భార్య, కుమారుడిని సైతం వైద్య పరీక్షలకు తరలించారు. వారిద్దరికి కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చింతల రామచంద్రారెడ్డి నగరంలోని ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఓటమిచెందారు. మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2698 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 82కు చేరింది.