వంశపారంపర్య హక్కు పునరుద్ధరణ జీవో జారీ

ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న అర్చకుల కల నేరవేరింది. గత ప్రభుత్వ హయాంలో వంశపారంపర్య అర్చకత్వం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారు. నేడు,రేపు అంటూ తెలుగుదేశం ప్రభుత్వం  ఐదేళ్ల పాటు కాలయాపన చేసి చివరకు మొండి చెయ్యి చూపించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్చకులకు బాసటగా నిలిచారు. అర్చకుల వంశపారంపర్య అర్చకత్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అర్చక చట్టం సవరణ జరిగితే, తనయుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పించారు. దీంతో జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న అర్చకులు,వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

అర్చకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వంశపారంపర్య హక్కులను పునరుద్ధరిస్తూ వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జీవో  జారీ చేశారు. త్వరలోనే ఈ జీవో అమలుకానుంది. ఈ సమస్యతోపాటు ఇతర సమస్యల సాధన కోసం అర్చక సంఘాలు గత ప్రభుత్వ హయాంలో ఉద్యమాలు చేశాయి. టీడీపీ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు. జగన్‌ సీఎం కాగానే వీరి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. వంశపారంపర్య హక్కులను కల్పించారు. అలాగే ప్రతి ఆలయంలో పనిచేసే అర్చకులకు కనీస వేతనం ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారు. 6బి,6సి దేవాలయాల్లో పనిచేసే ప్రతి అర్చకుడికి రూ. పదివేలు జీతం ఇవ్వాలని దేవదాయ అధికారులను సీఎం ఆదేశించారు. సంకల్పయాత్రలో, విశాఖలో నిర్వహించిన బ్రాహ్మణ గర్జనలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చుకుటున్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది నెలలకే వంశపారంపర్య హక్కు జీవో విడుదల చేయడంతో అర్చకులు సంతోషంలో వ్యక్తం చేస్తున్నారు.