అంచనాలను మించిన ఎస్‌బీఐ క్యూ1 ఫలితాలు

ప్రభుత్వరంగ బ్యాంక్‌ దిగ్గజం ఎస్‌బీఐ శుక్రవారం వెల్లడించిన క్యూ1 ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించాయి. బ్యాంక్‌ నికరలాభం జోరుగా పెరిగి రూ.4189 కోట్లకు చేరింది. ఈ లాభంలో అనుబంధ కంపెనీ వాటా విక్రయం ద్వారా ఒనకూడిన రూ.1500 కోట్లు కలిసి ఉన్నాయి. మార్కెట్‌ నికర లాభపు అంచనాలు రూ.3200 కోట్లుకాగా, భారీ స్థాయిలో ఈ అంచనాలను ఎస్‌బీఐ అధిగమించడం విశేషం. అలాగే బ్యాంక్‌ తాజా మొండిబకాయిలు ఎన్‌పీఏలు, కేటాయింపులు వంటి అంశాలన్నింటిలోనూ మెరుగైన పనితీరు కనబరిచింది. జూన్‌ క్వార్టర్‌లో బ్యాంక్‌ మొండి బకాయిల కేటాయింపులు రూ.11వేల కోట్ల నుంచి రూ.8వేల కోట్లకు తగ్గాయి. అలాగే బ్యాంక్‌ తాజా మొండిబకాయిలు రూ.8101 కోట్ల నుంచి రూ.3008 కోట్లకు తగ్గాయి. స్థూల ఎన్‌పీలు 6.44శాతం నుంచి 5.శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 2.33శాతం నుంచి 1.86శాతానికి తగ్గాయి. బ్యాంక్‌ ప్రోవిజన్‌ కవరేజ్‌ రేషియో 86శాతానికి చేరడం విశేషం.